Monday, July 19, 2010

ఏమిటీ దౌర్భాగ్యం.. చనిపోవాలని వుంది: హరికృష్ణ

Posted by Unknown On 4:36 AM 0 comments

కేంద్రం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ సర్కార్లపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మండిపడ్డారు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ సర్కారు తాకట్టుపెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర పోలీసుల నిర్బంధంలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబును పరామర్శించేందుకు ఆయన సోమవారం హైదరాబాద్‌‍ నుంచి ధర్మాబాద్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయనను అదిలాబాద్-నిజామాబాద్ సరిహద్దుల్లోని బాసరలో మన రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. మహారాష్ట్ర వైపు వెళ్లేందుకు వీలు లేదని తేల్చి చెప్పారు. దీనికి హరికృష్ణ ససేమిరా అనడంతో ఆయనను అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో నిజామాబాద్‌కు తరలించారు.

అంతకుముందు హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ అధినేతను మహారాష్ట్ర సర్కారు చట్ట వ్యతిరేకంగా అరెస్టు చేసిందన్నారు. చంద్రబాబును ఒక పౌరుడిగా పరమార్శించేందుకు వెళుతుంటే మన రాష్ట్ర పోలీసులే అడ్డుకోవడమేమిటని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రయోజనాలను ఇప్పటికే ఢిల్లీలో తాకట్టుపెట్టిన రాష్ట్ర కాంగ్రెస్.. ఇపుడు పౌరులను స్వేచ్ఛగా సంచరించకుండా చేస్తోందన్నారు. మహారాష్ట్రకు ఒక పౌరుడిగా వెళ్లడం తప్పా అని ఆయన నిలదీశారు. తానేమీ దొంగను కాదని, చంద్రబాబును పరామర్శించి తిరిగి వస్తానని పోలీసులతో మొత్తుకున్నా వదిలిపెట్టలేదు. దీంతో మరింత ఆగ్రహంతో రగిలి పోయారు.

మహారాష్ట్ర పోలీసులు అరెస్టుచేయడంలో తప్పులేదన్నారు. తనను మన రాష్ట్ర సరిహద్దుల్లోనే అడ్డుకోవడం చాలా బాధగా ఉందన్నారు. తానేమీ దొంగను కాదన్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎదురు కావడం సిగ్గుగా ఉందన్నారు. ఈ సంఘటనలు చూసేందుకు ఉండటం కంటే చచ్చిపోవాలని ఉందని హరికృష్ణ ఆవేదనతో అన్నారు.

తెలుగువాడి ఆత్మగౌరవం మరోమారు ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర కాంగ్రెస్ పాలకులు తాకట్టుపెట్టారన్నారు. ఈ చర్యతోనైనా ప్రతి తెలుగు పౌరుడు మేల్కొని తెలుగువాడి సత్తా చూపేందుకు ముందుకు రావాలన్నారు. రాష్ట్రంలో ఏదైనా ఓపెనింగ్‌ల కోసం రిబ్బన్ కత్తిరించేందుకు వచ్చే సోనియా, మన్మోహన్ సింగ్‌లు ఇపుడు ఏం చేస్తున్నారని హరికృష్ణ ప్రశ్నించారు.

0 comments:

Post a Comment