Monday, July 19, 2010

జగన్ ప్రచారంపై సోనియా ఆగ్రహం: ఏ క్షణమైనా చర్య!

Posted by Unknown On 4:38 AM 0 comments

కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే అధిష్టానాన్ని ధిక్కరించి ఓదార్పు యాత్రను చేపట్టిన జగన్‌ పట్ల ఏఐసీసీ ఉదాసీన వైఖరిని అవలంభిస్తోంది.

అయితే, జగన్ చేస్తున్న ప్రచారం పట్ల మాత్రం హైకమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నట్టు ఏఐసీసీ వర్గాల సమాచారం. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ వైఎస్ఆర్ పథకాలుగా జగన్ ప్రచారం చేయడాన్ని సోనియా జీర్ణించుకోలేక పోతున్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. వైఎస్ ఒక్కరే పథకాలన్నీ ప్రవేశపెట్టి అమలు చేశారా? ఈ పథకాల అమలులో కాంగ్రెస్ అధిష్టానం సహకారం లేదా అని ఆమె ప్రశ్నించినట్టు వినికిడి. తన వ్యక్తిగత పరువు ప్రతిష్టల కోసం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని ఆమె తీవ్రంగా పరిగణిస్తున్నారు.

అందువల్లే రాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రోశయ్యను తక్షణం ఢిల్లీకి రావాల్సిందిగా ఆమె కబురు పంపారు. సోమవారం సోనియాతో రోశయ్య భేటీ అవుతారు. ఈ సమావేశంలో జగన్ ఓదార్పు యాత్ర, చేస్తున్న ప్రచారం, ఆయన వెంట ఉండే నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వివరాలను సోనియా అడిగి తెసుకునే అవకాశాలు ఉంది. ఆ తర్వాత జగన్‌పై చర్యకు అధిష్టానం ఉపక్రమించే పరిస్థితులు ఉన్నట్టు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

0 comments:

Post a Comment